1 John 5

విశ్వాసమే ఈ లోకం లో విజయం

1యేసే క్రీస్తు అని నమ్మినవారంతా దేవుని ద్వారా పుట్టినవాళ్ళే. తండ్రిని ప్రేమించిన వారంతా ఆయన ద్వారా పుట్టినవాణ్ణి కూడా ప్రేమిస్తారు. 2మనం దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటే, దేవుని పిల్లల్ని ప్రేమిస్తున్నామని దాని వల్ల మనకు తెలుసు. 3ఆయన ఆజ్ఞల్ని పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. ఆయన ఆజ్ఞలు భారం కాదు.

4దేవుని ద్వారా పుట్టినవారు అందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించింది మన విశ్వాసమే. 5లోకాన్ని జయించేది ఎవరు? యేసు దేవుని కుమారుడు అని నమ్మినవాడే!

6నీళ్ళ ద్వారా, రక్తం ద్వారా వచ్చినవాడు యేసు క్రీస్తే. ఆయన కేవలం నీటి ద్వారా మాత్రమే కాదు. నీళ్ళ ద్వారానూ, రక్తం ద్వారా కూడా వచ్చాడు. దేవుడు ఆత్మ రూపి గనక ఆత్మే సాక్షమిస్తున్నాడు 7సాక్షం ఇచ్చే వారు ముగ్గురున్నారు. 8ఆత్మ, నీళ్ళు, రక్తం, ఈ మూడూ ఒకే సాక్షం చెబుతున్నాయి.

9మనుషుల సాక్షం మనం స్వీకరిస్తాం. కాని దేవుని సాక్షం అంతకన్నా గొప్పది. దేవుని సాక్షం, ఆయన కుమారుణ్ణి గూర్చినదే. 10దేవుని కుమారుని పట్ల విశ్వాసం ఉంచిన వారిలోనే సాక్షం ఉంటుంది. దేవుడు తన కుమారుని గురించి ఇచ్చిన సాక్షం నమ్మనివాడు దేవుణ్ణి అబద్ధికుణ్ణి చేసినట్టే.

11ఆ సాక్షం ఇదే: దేవుడు మనకు శాశ్వత జీవం ఇచ్చాడు. ఈ జీవం తన కుమారునిలో ఉంది. 12కుమారుడు ఉన్నవానికి జీవం ఉంది. దేవుని కుమారుడు లేని వాడికి జీవం లేదు.

13దేవుని కుమారుని నామంలో విశ్వాసం ఉంచిన మీకు శాశ్వత జీవం ఉందని మీరు తెలుసుకోడానికి ఈ సంగతులు మీకు రాస్తున్నాను. 14ఆయన దగ్గర మనకున్న ధైర్యం ఇదే: ఆయన చిత్తానికి అనుగుణంగా మనం ఏది అడిగినా, ఆయన మన విన్నపం వింటాడు. 15మనం అడిగిన విషయాలన్నీ ఆయన వింటాడని తెలిస్తే, మనం అడిగినవి మనకు కలిగాయని మనకు తెలుసు.

16తన సోదరుడు, మరణం కలిగించని పాపం చెయ్యడం ఎవరైనా చూస్తే, చూసినవాడు ఆ సోదరుని కోసం ప్రార్థించాలి. అతనిని బట్టి మరణం కలిగించని పాపం చేసినవానికి దేవుడు జీవం ఇస్తాడు. మరణం కలిగించే పాపం ఉంది. దాని విషయంలో అతను ప్రార్థించాలని నేను చెప్పను. 17సమస్త దుర్నీతీ పాపమే. కాని మరణం కలిగించని పాపం కూడా ఉంది.

18దేవుని ద్వారా పుట్టినవాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా పుట్టిన వానిని దేవుడు పాపం నుండి కాపాడుతాడు. దుష్టుడు ముట్టకుండా ఉంచుతాడు. 19మనం దేవుని సంబంధులం అని మనకు తెలుసు. సర్వలోకం దుష్టుని ఆధీనంలో ఉంది.

20దేవుని కుమారుడు వచ్చి, సత్య స్వరూపి ఎవరో తెలుసుకొనే జ్ఞానం మనకిచ్చాడు. మనం, ఆ సత్య స్వరూపి యేసు క్రీస్తులో ఉన్నాం. ఈయనే నిజమైన దేవుడూ, శాశ్వత జీవం కూడా. 21పిల్లలూ, విగ్రహాలనుండి దూరంగా వెళ్ళిపోండి.

Copyright information for TelULB